Friday, November 9, 2018

పురుష సూక్తము - Purusha Suktam in Telugu With Meanings

పురుషసూక్తము ఆదిదేవుడు మఱియును సృష్టి విధానము గురించి మనకు తెలుపుతున్నది. ఇది ఒక స్తోత్ర కావ్యము లాంటిది.

ఆ పరమపురుషుడు మఱియును సమస్త లోకాలకు మూల పురుషుడైన పరబ్రహ్మము యొక్క ప్రశస్తిని మరియు సృష్టి కార్యము జరిగిన విధానమునును ఇందులో మిక్కిలి విశదముగా వివరించబడినది.

ఆ పరంధాముడు ఏ విధముగా బ్రహ్మాండ మందు ఆవిర్భవించెనో మఱియును ఈ అద్భుతమైన సృష్టి కార్యమును ఏ విధంగా ఒనరించెనో అన్ని సంగతులూ కూడా చక్కని శ్లోకముల ద్వారా పూర్తిగా తెలియబరచు చున్నది.

పురుషసూక్త పఠనము అన్ని గొప్ప పూజలు మఱియును యజ్ఞ సమయములందును యధావిధిగా చేయబడుట మనము ఎప్పుడూ చూస్తుంటాము. దీని పఠనము చేసినచో అన్ని కార్యములు, పూజలు, యజ్ఞములూ కూడా ఏ విధమైన ఆటంకములు, విఘ్నాలు లేకుండా సఫలమగును. అంతే కాక మనకు ఆ పరంధాముని ఆశీస్సులను ప్రసాదించును.పురుష సూక్తము లో రెండు విభాగములు ఉన్నాయి.

మొదటి భాగము సృష్టి రచనా విధానము గురించి తెలుపుతోంది. ఇందులో 18 శ్లోకములు ఉన్నవి.

రెండవ భాగము ఆ పరమపురుషుని మరియు విరాట్పురుషుని యొక్క ఉనికిని, స్వభావములను విశదీకరిస్తోంది. ఇందులో 7 శ్లోకములు ఉన్నాయి. ఏడవది చిన్న శ్లోకము.

పూర్తి పఠనము అయినతరువాత చివరన ఇచ్చిన ఒక శాంతి పాఠము కూడా పఠనము చేయుట సాంప్రదాయము మరియు శుభకరము కూడ.

1. పురుష సూక్తము (మొదటి భాగము)


1. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సమస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ ద్దశాజ్ఞులమ్ ||

(పురుషుడు - అంటే భగవంతుడు లేదా పరమాత్మ - వేయి శిరములు కల్గినవాడు. అనగా ఊహకు మించిన వాడు. అలాగే వేయి  కనులు, వేయి పాదములు కలిగినవాడు. భూమితో కూడిన సమస్త విశ్వమును మించి ఇంకా ఎక్కువ విస్తీర్ణము కలవాడు. అనగా సమస్త విశ్వము కన్నా అధికమైన ఆకారమున్నవాడు. ఇక్కడ తాత్పర్యమేమిటంటే మన కొలతలకు, ఊహకు కూడ మించినవాడు అని.)  

2. పురుష ఏవేదమ్ సర్వమ్ య ద్భూతం యచ్చ భవ్యమ్ |
ఉతామృతత్వ స్యేశానః య దన్నే నాతిరోహతి ||

(ఆ పరమాత్ముడే సమస్త వేదములును మరియు భూత, భవిష్య, వర్తమానములును. ఆయనే అమరత్వానికి అధిపతి మరియును సమస్త ఆహారములకు అధిపతి.)

3. ఏతావా నస్య మహిమా ఆతో జ్యాయాగంశ్చ పూరుషః |
పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి ||

(ఆయన మహిమ అటువంటిది. ఆయన ఉనికి మన కల్పనకు అతీతమైనది. మనకు కనపడు ఈ సమస్త జీవలోకం అయన ఒక పాదము మాత్రమే. అంటే నాలుగవ భాగము మాత్రమే. మిగతా మూడు భాగాలు కూడ మృత్యువు లేని స్వర్గలోకము.)

4. త్రిపా దూర్ధ్వ ఉదై త్పురుషః పాదో స్యేహాభవాత్పునః |
తతో విష్వ జ్వ్యక్రామత్ సాశనానశనే అభి ||

(ఆయన లోని మూడు భాగములు పైకి వ్యాపించగా ఒక భాగమును మాత్రము క్రిందికి వ్యాపింపచేసెను. ఆ భాగము మరల సమస్త జీవములను జీవము లేని స్థాణువులనూ కూడా ఆక్రమించెను.) 

5. తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః |
స జాతో త్యరిచ్యత పశ్చాద్భూమి మధో పురః ||

(అటువంటి ఆయన నుండి విరాట్ పురుషుడు ఉద్భవించెను. విరాట్ పురుషుని నుండి పురుషుడు అనగా జీవుడు ఉద్భవించెను. పిమ్మట ఆ పురుషుడు తనను దేవతలు, మనుష్యులు, వృక్షములుగా ఆ విరాట్ పురుషుని నుండి వేరు చేసుకొనెను. ఆ తర్వాత భూమి, శరీరములు  ఉద్భవించెను.)

6. యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞ మతన్వత |
వసన్తో అస్యాసీ దాజ్యమ్ గ్రీష్మ ఇధ్మః శర ద్ధవిః ||

(ఆ పురుషుడి ఉనికితో (ఆయనే కర్తగా భావించి) దేవతలు యజ్ఞము చేసినపుడు వసంతాన్ని ఆజ్యముగా పోసి, గ్రీష్మమునే సమిధలుగా  మంటలు లేపి, శరత్ కాలాన్ని నైవేద్యముగా సమర్పించారు.)

7. సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః అభధ్నన్ పురుషం పశుమ్ ||

(ఆ పురుషుని చుట్టూ ఏడు సరిహద్దులు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారం, బుద్ధి తత్త్వములతో చుట్టేసి, ఇరువదిఒక్క సమిధలతో ఆ దేవతలు యజ్ఞము చేసారు. యజ్ఞ పశువుగా ఆ పురుషుని బంధించారు.)

8. తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాత మగ్రతః |
తేన దేవా అయజన్త సాధ్యా ఋషయశ్చ యే ||

(ఆ విధముగా మొదట జన్మించిన పురుషుని ఎవరైతే యజ్ఞానికి శ్రేష్టులో సంప్రోక్షించి దేవతలు, సిద్ధిసాధకులు, ఋషులు సృష్టి యజ్ఞమును  జేసిరి.) 

9. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభ్రుతం పృషదాజ్యమ్ |
పశూమ్స్తాన్ శ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే ||

(పిమ్మట ఆ సృష్టి యజ్ఞము నుండి ఉద్భవించెను పెరుగు, నెయ్యి. ఆ తర్వాత సృష్టించబడినవి యజ్ఞ పశువులు, గాలిలో ఎగిరే పక్షులు, అడవి మృగాలు, గ్రామాలలోని జంతువులు.) 

10. తస్మా ద్యజ్ఞాత్ సర్వహుతః ఋచః సామాని జజ్ఞిరే |
ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్ యజు స్తస్మా దజాయత ||

(ఆ సృష్టి యజ్ఞమునుండే ఋగ్వేదము, సామవేదముల మంత్రములు, గాయత్రీ మంత్రము మొదలగు సకల చ్ఛందములు, మరియు యజుర్వేద మంత్రములు కూడ ఉద్భవించెను.)

11. తస్మా దశ్వా అజాయన్త యే కే చోభయా దతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ తస్మా జ్జాతా అజావయః ||

(ఆ యజ్ఞమునుండే అశ్వములు మరియు ఏక దంత వరుస అలాగే రెండు దంత వరుసలు గల్గిన జంతువులూ సృష్టించబడాయి. ఆవులు, మేకలు, గొర్రెలు పుట్టాయి.)

12. యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ కావూరూ పాదా వుచ్యేతే ||

(ఎప్పుడైతే దేవతలు ఆ మహా పురుషుని సృష్టించారో అప్పుడు ఆయన రూపకల్పనని ఏ విధంగా తీర్చిదిద్దారు? ముఖం ఏ ఆకృతి తీసుకున్నది? చేతులు ఏవి? తొడలు, పాదాలు ఏమిటయ్యాయి?) 

13. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత ||

(బ్రాహ్మణులు ముఖమయ్యారు. బాహువులు క్షత్రియులయ్యారు. తొడలనుండి వైశ్యులు అల్లాగే పాదాలనుండి శూద్రులు రూపొందారు.)

14. చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత |
ముఖా దింద్రశ్చాగ్నిశ్చ ప్రాణా ద్వాయు రజాయత ||

(మనస్సు నుండి చంద్రుడు పుట్టాడు. కనులనుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రుడు మరియు అగ్ని ఉద్భవించారు. ప్రాణము అనగా ఊపిరి నుండి వాయువు ఉద్భవించెను.)

15. నాభ్యా ఆసీ దంతరిక్షమ్ శీర్షణో ద్యౌః సమవర్తత |
పధ్భ్యాం భూమి ర్దిశః శ్రోత్రాత్ తథా లోకాన్ అకల్పయన్ ||

(నాభి నుండి అంతరిక్షం అంటే ఆకాశము వచ్చింది. శిరము నుండి స్వర్గలోకము వెలువడెను. పాదములనుండి భూమి, చెవుల నుండి దిక్కులు వచ్చెను. ఈ విధముగా ఆ పురుషుని సంకల్పమాత్రాన సమస్త లోకము వెలువడెను.)

16. వేదాహ మేతం పురుషం మహాన్తమ్ ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామానికృత్వా భివదన్ యాదాస్తే ||

(నేను జ్ఞానము పొందాను ఆ పురుషుని గురించి ఎవరైతే మహానుభావుడు, అలాగే సూర్యుని వలె దేదీప్యమానుడు, ఈ కనపడే ప్రకృతికి భిన్నమైనవాడు, మరియు సకల ప్రాణులను సృష్టించి, నామకరణము చేసి, వాటిలో ప్రవేశించి వాటిని నడిపించేవాడు కూడ ఆయనే అని తెలుసుకున్నాను.)

17. ధాతా పురస్తా ద్య ముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః |
తమేవం విద్వా నమృత ఇహ భవతి నాన్యః పన్థా ఆయనాయ విద్యతే ||

(బ్రహ్మ దేవుడు ఆ పురుషుని తన సృష్టికి  మూల కారణముగా ఎరిగెను. వేయి కళ్ళు ఉన్న ఇంద్రుడు కూడా ఆ మహాపురుషుని మహిమలను తెలిసికొని నాలు దిక్కులా చాటెను. ఆయన మహిమను తెలుసుకున్నవాడు ఈ జన్మలోనే ముక్తి పొందురని కూడ తెలుసుకున్నారు. ఇంత కన్నా వేరే మార్గము లేదు కూడ.) 

18. యజ్ఞేన యజ్ఞ మయజన్త దేవాః తాని ధర్మాణి ప్రథమా న్యాసన్ |
తేహ నాకం మహిమాన స్సచన్తే యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః ||

(ఈ విధముగా దేవతలు మానస యజ్ఞము యొక్క గొప్పతనమును తెలుసు కున్నారు. ఈ యజ్ఞ కర్మలు తక్కిన కర్మల కంటే శ్రేష్ఠమైనవిగా గణించబడినవి. ఏ విధముగా అయితే సాధ్యోపాసకులు పరిపూర్ణ జ్ఞానముతో తిన్నగా వైకుంఠంలో నివసించుతారో అదే విధముగా ఈ శ్రేష్టమైన మానస యజ్ఞ కర్మలను అనుసంధించేవారు కూడా ఆ లోకములోనికి ప్రవేశము పొందుతారు.)

పురుష సూక్తము (రెండవ భాగము)


అద్భ్య సంభూతః పృథివ్యై రసాచ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి | 
తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమా జానమగ్రే || (1)

(జలము మరియు పృథ్వి యొక్క సారము నుండి బ్రహ్మాండము ఉద్భవించెను. అటు పిమ్మట ఆ బ్రహ్మాండము యొక్క సృష్టికర్త మరియు యజమాని అయిన విరాట్ పురుషుడు తన ఉనికిని సకల లోకములలోను నింపుకొనెను.)

వేదాహమేతం పురుషం మహాన్తమ్ | ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ | 
తమేవం విద్వానం అమృత ఇహ భవతి | నాన్య పంథా విద్యతేయనాయ || (2)

పైన ఇవ్వబడిన 16వ శ్లోకము ఈ రెండవ శ్లోకము వేరు వేరు అని గమనించగలరు.

(నేను ఎరిగితిని ఈ పురుషుడు ఎవరైతో సూర్యుని వలె తేజోమయుడై అంధకారమును జయించువాడో. ఇతని సకల జ్ఞానమును ఎరింగినవారు మృత్యువుని ఈ జన్మలోనే జయిస్తారు. అంతకంటే గొప్పదారి వేరే ఏమీ లేదు కూడా మోక్షానికి.)

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః | అజాయమానో బహుథా విజాయతే |
తస్య ధీరా పరిజానన్తి యోనిమ్ | మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః || (3)

(ఆ పరమ పురుషుడు జన్మించకుండానే ఈ ప్రపంచములో అన్ని విధములుగా వ్యాపించుచున్నాడు. ఈ ఉనికి యొక్క మూలాన్ని జ్ఞానులు పరీక్షించి తెలుసుకుంటున్నారు. ఆ విధంగా మరీచి వంటి గొప్ప జ్ఞానులుగా కాగలుగుతున్నారు.)

యో దేవేభ్య: ఆతపతి | యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాత: | నమో రుచాయ బ్రాహ్మయే || (4)

(ఎవరైతే దేవతల యందు ప్రజ్వరిల్లుతూ ఆ దేవతలకు పురోహితునిగా శోభిల్లుతూ దేవతలందరి కంటే ముందుగా ఉనికిలో ప్రవేశించెనో అట్టి ఆ పరమ పురుషునికి నా నమోస్సులు.)

రుచమ్ బ్రాహ్మమ్ జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్తు వేవమ్ బ్రాహ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే || (5)

(ఆ పరబ్రహ్మ స్వరూపమును ఎఱిగినవారై దేవతలు మొదట నిలబడి ఆ జ్ఞానమును వ్యాపింపజేసిరి. అల్లాగే ఎవరైతో ఆ జ్ఞానమును తెలిసికొని మసలుకుందురో వారికి దేవతలు తోడుగా ఉండి వ్యవహరించురు.)

హ్రీశ్చతే లక్ష్మిశ్చ పత్నౌ | అహోరాత్రే పార్శ్వౌ |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్ ||           (6)

(భూదేవి, లక్ష్మీదేవి ఆయనకు భార్యలు. పగలు రేయిలు పార్శ్వములు. ఆయనకు ఆకారము నక్షత్రమండలము. అశ్వినీదేవతలు పెదవులతో కూడిన ముఖము.)

ఇష్టమ్ మనీషాణ | అముమ్ మనీషాణ | సర్వమ్ మనీషాణ || (7)

(ఓ పరమాత్మా మా అభీష్టములు ప్రసాదించండి. ఆనందములు ప్రసాదించండి. సకల సుఖశాంతులు ప్రసాదించండి.)

శాంతి పాఠము

ఓం  తచ్ఛం యోరావృణీమహే | గాతుమ్ యజ్ఞాయ | గాతుమ్ యజ్ఞపతయే | దేవీస్వస్తిరస్తు నః | స్వస్తిర్మానుషేభ్యహ్ |
ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శం నో అస్తు ద్విపదే | శం చతుష్పదే | ఓమ్ శాంతిః శాంతిః శాంతిః ||

(సమస్త జీవరాశుల కళ్యాణము కొరకై యజ్ఞములు వర్ధిల్లు గాక! యజ్ఞపతి అయిన పరమాత్మ వర్ధిల్లు గాక!
దేవతలు సుఖముగా ఉందురు గాక! మానవులు సుఖమొందు గాక! పుష్కలముగా వర్షములు కురియుగాక!
ద్విపాదములున్న జీవులు కూడ సుఖమొందురు గాక! నాలుగుపాద జీవులు కూడ వర్ధిల్లు గాక! అంతటా సుఖశాంతులు ప్రజ్జ్వరిల్లు గాక!)